ఎల్లలు దాటిన తెలుగుతనం  (Author: బోగా మనోహర)

తెలుగు వారి గురించి ఏమి చెప్పాలి? ఎంత చెప్పాలి? ఎంత చెప్పిన అదొక తరగని గని కదండీ!! తెలుగుతనం అంటే ఏదో ఒక్క మాటలో చెప్పనలవి  కానిదై, అది ఎన్నో అంశాల మిళితం ‘కాదు-కాదు’, "సమ్మిళితం." అల్లం,జీలకర్ర,పచ్చిమిర్చి,పెసలు కలిస్తే “మంచి పెసరట్టు తయారైనట్లుగా బహు చక్కనైన ఒద్దిక కదటండీనూ”----!  ఆగండి, ఆగండి ఇక్కడ నేనొక విషయాన్ని జ్ఞప్తికి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. “బొట్టు,బొట్టు చేరి సముద్రమైనట్టు”  తెలుగు రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా “అంతై,ఇంతై వటుడింతైనట్టు జగద్విఖ్యాతి గాంచింది.”

వేడి పెసరట్టు, అల్లం చట్ని కాంబినేషన్లో ఉదయపు ఫలహరం సేవించు  వేళ అంతర్జాలంలో Email Notification రాగానే ఆదుర్ధాగా ఓపెన్ చేశాను. తెలుగుతనం గురించి మీ మాటల్లో మాకు తెలియ చేయండి అనేది దాని సారాంశం  కాగా,  అది చూసి సంబరమైంది. ఇక ఆలస్యం దేనికి నా ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చి మీ ముందుంచుతున్నాను సుమీ!! ఇవి నేనెక్కడ  కాపీ కొట్టలేదండోయి, నా సొంత  అభిప్రాయములు మాత్రమే. పాఠకులు ఏకీభవించవచ్చును,పోకవచ్చును. ఇక విషయానికెళితే,  

చీర కట్టు,బొట్టు,సంప్రదాయాలు,ఆచారాలు,సాంస్కృతిక కళలు వీటన్నిటితో పాటు తెలుగువాడి ఔన్నత్యము,కీర్తి ఎక్కడైతే ప్రస్తుతించ బడుతుందో అక్కడ తెలుగుతనం వెల్లివిరిసినట్లే. తెలుగు వారి ఆత్మాభిమానం గౌరవించిన ప్రతి చోటా తెలుగుతనం గౌరవించబడినట్లే.  "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడారా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం."  తెలుగు విదేశాల్లో కూడా ప్రభుత్వ శాఖల్లో కొలువై ప్రభుత్వ పాలనలో భాగమై  “వాషింగ్టన్ హౌజులో, యునైటెడ్ కింగ్డం ప్రెసిడెంట్”  హోదాల్లో తమ ప్రతిభా పాటవాలతో అత్యున్నత శిఖరాలు అదిరోహించినప్పుడు “తెలుగుతనం నిండుగా నవ్వుకున్న క్షణం.”

 ప్రపంచంలో  ఏ “మూలకు వెళ్ళినా టార్చిలైటు వేసి వెతకకుండానే” మన తెలుగు వారు కనిపిస్తారు. కానీ ఒకప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నం అంటే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరించక ముందు మన తెలుగువారిని గుర్తించిదెవ్వరు ? తెలుగు భాష ప్రాచీనమైన భాష  అయినా  తెలుగు వారిని ద్రవిడ తమిళ  రాజ్యంలో  కలిపి  ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న రోజులవి. “తెలుగు వారిని మదరాసీలుగానే పిలిచేవారు.” అది అవమానకరం. తెలుగువారికి కూడా తగిన గుర్తింపు లేకపోవటంతో  “ఆత్మవంచన చేసుకొని ఇక బతకజాలం”  అంటూ  “తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎంతోమంది మహానుభావులు నడుం బిగించారు.” ఉద్యమాలు సాగించారు. “ప్రముఖంగా పొట్టి శ్రీరాములు  గారు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్  కోసం”  బులుసు సాంబమూర్తి గారి ప్రోత్చాహంతో  “నిరాహార దీక్ష “చేపట్టకపోతే మనం ఇంకా ” ద్రవిడ మదరాసీల ఆధిపత్యంలోనే ఉండేవాళ్లమేమో!!” ఆ “త్యాగశీలి పుణ్యం తెలుగురాష్ట్రం  ఆవిర్భవించటం.” తెలుగుతనం విశ్వ విఖ్యాతమై పరిఢ విల్లటం!! అలాంటి మహామూర్తికి సినిమా వారి పాటి నివాళులర్పిస్తున్నరా అంటే “ప్రశ్నార్ధకమే.” అది వేరే విషయం అనుకోడి.

తెలుగు తనం ప్రతి రోజూ ప్రతి ఇంటా మన అలవాట్లు, పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పరిసరాలు, పాడిపంటలు, ప్రకృతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో  విషయాలతో ముడిపడి ఉంది. మనం జరుపుకునే ప్రతి పండుగలో తెలుగు తనం మరింత ఇనుమడింప బడుతుంది. తెలుగుతనమును ప్రతిబింబించే జడలు,జడలలో పూలు, వయసుకు తగిన పరికిణీ వోణీలు, ముంగిట ముగ్గులు, గొబ్బిమ్మలు “తెలుగు సంస్కృతికి ఇవన్నీ చిహ్నాలే.” 

తెలుగు భాష అక్షరమాల,వర్ణమాలతో తరియించి అం అఃలు,గుణింతాలు ,వత్తులు,సంధులు, సమాసాలలో చేరి ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’,  ‘చేతి వెన్నముద్ద  చెంగల్వ పూదండ‘ అని ఈనాటి తరం వరకు పాడుకోవటం.

"దేశ భాషలందు తెలుగు లెస్స" అని కితాబిచ్చిన రాయల వారి కొలువులో అష్టదిగ్గజాలు,భువన విజయం,హంపి సోయగం పేరు ప్రస్తావన లేకుండా అజంతా, యెల్లోరా శిల్ప సౌందర్యం గురించి వర్ణించకుండా తెలుగుతనం గురించి మాట్లడగలమా?

 “ఆంధ్రప్రదేశ్  అన్నపూర్ణగా విలసిల్ల” సిరులు పండించ ప్రతి రైతు కుటుంబం ఆనంద డోలికలు, “సంక్రాంతి సంబరాలు అంబరాలైతే!”  డూడూ బసవన్నలు, హరిదాసులు,ముంగిట ముగ్గులు, గొబ్బిళ్ళు, గుమ్మడి పువ్వులు, పట్టు పావడా ధరియించి గొబ్బి తడుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడే పడుచు భామలు, భోగి మంటలు, పాలు గాచి పొంగళ్లు మొదటి రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం, పెద్దలు-పిన్నలు తలంటు స్నానాలు, భోగి పళ్లు, ముత్తైదువులు దీవెనలు. 

రెండో రోజు సంప్రదాయ పిండి వంటలు అరిసెలు, బూరెలు, పాలముంజలు, కజ్జికాయలు, సున్నుండలు, పాయసం, బొబ్బట్లు, జంతికలు, చక్కిలాలు/చక్రాలు, గులాబీ పువ్వులు, తపాల చెక్కలు,పూత రేకులు, రిబ్బన్ పకోడి, ఒక్కొక్క ప్రాం-తంలో ఒక్కో పిండివంటలతో  "సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే."

ఇక మూడో రోజు గారెలు,వడలు,రాగిసంకటి,నాటుకోడి పులుసు మాంసాహారులు  అదరహొ అనేలా--!  కోడిపందాలు, ఎడ్ల పందాలు, పోట్లగిత్తల మరదల్ని బావలు ముక్కుపిండు-తూ ఆట పట్టించటం ఇన్ని విశేషాలున్న “తెలుగు వాళ్ల అతి పెద్ద పండుగ సంక్రాంతి  తెలుగు తనానినికి నిలువెత్తు నిదర్శనం కాదా!!”

హరికధలు, బుర్రకధలు, నృత్య ప్రదర్శనలు, పాట కచేరీలు ఇవన్నీ తరతరాలుగా వస్తున్న అచ్చ తెలుగు సంప్రదాయాల్లో భాగం. అలాగే ఉగాది పండుగ తెలుగుతనం ఉట్టిపడే పండుగ-ల్లో ఒకటి. ప్రకృతిలో మమేకమైన పండుగ. సంప్రదాయ చెట్లు వృక్ష సంపదకు నిలువెత్తు సాక్షాలు.వేపచెట్టు ఆయుర్వేద ఔషద గుణాల పుట్ట. వేపపువ్వు, వేప కాయలతో చేసే వేప పచ్చడి ఆరోగ్య శ్రేష్టం, లేలేత మామిడి కాయలతో పచ్చని మామిడి చెట్ట్లు. చిన్ననాటి జ్ఞాపకాలతో చిరిపేటి చెట్టు, చిగుర్లు తొడిగిన జామ చెట్టు, ఏ ఇంటి గృహ ప్రవేశంలో నైన సాక్షాత్క-రించే అరటి చెట్టు, కుడుముల తయారీలో వాడే గంగిరేటి ఆకుల గంగిరేటి చెట్టు నేరేడు చెట్టు, బాదం చెట్టు, చింతకాయల చెట్టు, జామ కాయల చెట్టు, రేగి పళ్ళ చెట్టు, కొబ్బరి చెట్లు వృక్ష సంపదను కాపాడుకోవటం కూడా నిలువెత్తు తెలుగు-తనమే.  ఒక్కొక్క సీజనకి ఒక్కొక్క పండుగ అనుసంధానం చేశారు మన పెద్దవారు. మాతాబులు, చిచ్చురు బుడ్లు కళ్లకు మిరుమిట్లు గొలిపే కాంతులలో పిల్లలు కేరింతలు కొడుతుంటే "తెలుగు లోగిళ్ల దీపావళి ఆనంద కేళి."

ఇక శ్రీరామ నవమి నాడు "చలువ పందిరి నీడలో సీతా రాముల వారి పెళ్లి." ఊరు,వాడంతా వడపప్పు పానకంతో తరియించటం “అది కాదా తెలుగుతనం---??”

గుడికి వెళ్లటం, కుంకుమ బొట్టు,నామాలు దిద్దుకోవటం చందనాది తిలకాంక్రుతులు కావటం, సాష్టాంగ నమస్కారాలు ఇవన్నీ మనం ఆచరిస్తున్న  ఆచారాలలో భాగమే!!

కార్తీక మాసంలో “దీపజ్యోతులు”  గుడి ప్రాంగణంలో ప్రజ్వలించ  స్త్రీ మూర్తులు ఒకటిగా చేరి "అరటి దొన్నెల పైన నూనె  దీపాలు వదలటం" పరమ శివుణ్ని దర్శించి తరియించ!!

శ్రావణ మాసంలో నోములు, మంగళ గౌరీ పూజలు, వరలక్ష్మి వ్రతాలు ముత్తైదువులకు  తాంబులాలు ఇవ్వటం, అమ్మవారి అలంకరణలు ఇవన్ని తెలుగు తనానికి నిలువెత్తు నిదర్శనాలు.

ప్రతి పెళ్లి వేడుక ఒక ఆనంద కోలాహలం. ఆ కోలాహలం తెలుగు తనానికి శోభాయమానం. కొబ్బరాకు పందిర్లు, వడ్డాణం, వంకీలు, బుగ్గన చుక్క, పారాణి ధరియించిన పెండ్లి కూతురు. తలపాగా ధరియించిన పెండ్లి కుమారుడు. జీలకర్ర బెల్లం,వెదురుకోళ్లు,పానుపు వేళ పాడే గమ్మత్తైన పాటలు, కొత్త జంటని గుమ్మంలో నిలిపి అర్ధ మొగుడు ఆడపడుచు నీ మొగుడు పేరేంటమ్మా  అంటే సిగ్గుల మొగ్గవుతూ తలదించుకున్న వదినమ్మ, "వరుసైన వారు వసంతం ఆడుకోవటం" (చాల పురాతనమైనది బహుశా గంధర్వుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం). "పెళ్లి విందు తెలుగు వారికి పసందు." అరటాకు భోజనం అందులో తప్పక వండించే "పప్పు, నెయ్యి, పులిహోర, గోగుర పచ్చడి, గుత్తి వంకాయ కూర లేకుండా తెలుగు వాడి కడుపు నిండుతుందా?"

నిలువెత్తు చీర మడిచి కాళ్లకు అటు,ఇటు చుట్టి  నాట్య గత్తె అవతరంచే రంగు రంగుల వస్త్రాలు , ఆభరణాలు ధరించి  కాళ్లకు గజ్జే కట్టి ఆడే "నాట్య మయూరి తెలుగు తనానికి చక్కని ప్రతీక."

శిల్పి చెక్కే శిల్ప కళలో  తెలుగుతనం ప్రస్పుటించే, కుమ్మరి వాడి హస్త కళలో తెలుగుతనం బహు చక్కగా తొంగిచూసే!!

తెలుగు వాడి ఇంట జున్ను, ఉలవ చారు, గడ్డ పెరుగు,  మీగడ, వెన్న, గోమాత పూజ, పాడి సంపద తెలుగు తానానికి వన్నె తెచ్చె. 

తెలుగు తనం లేనిది ఎక్కడ ప్రతి ఇంటా ప్రతి తెలుగు వారి గండె జప్పుడు. అనునిత్యం ప్రతి అంశంలో తొంగిచూస్తూనే ఉంటుంది. వీటన్నింటి సారాంశం ఒక్కటే తెలుగుతనం అంటే  కులం లేదు,మతం లేదు చిన్న,పెద్దా తారతమ్యం లేదు. "అన్ని మరచి అందరూ కలిసి హాయిగా ఆదమరచి చేసుకునే సంబరము." ఆనందాలు పంచిపెట్టే అంగరంగ వైభవం.

------------------సశేషం-------------

0 Comments